- కాచిగూడలోని టూరిస్ట్ ప్లాజా హోటల్, రైల్వే స్టేషన్‌పై దాడులు చేస్తామని హెచ్చరిక
- 'టెర్రర్ థ్రెట్' పేరిట పోలీస్ అలర్ట్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగరంలో ఉగ్రదాడులు జరుపుతామంటూ వచ్చిన బెదిరింపు ఈ మెయిల్ ఆదివారం తీవ్ర కలకలం రేపింది. 26/11 ముంబై తరహా దాడులు చేస్తామని, బాంబు పేలుళ్లతో భారీ ప్రాణనష్టం కలిగిస్తామని పేర్కొంటూ లష్కరే తోయిబా పేరుతో హైదరాబాద్ పోలీసులకు మెయిల్ వచ్చింది. తమ నాయకుడు లతీఫ్ భట్, ఇతర సహచరుల హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని మెయిల్లో పేర్కొన్నారు.
కాచిగూడలోని హోటల్ టూరిస్ట్ ప్లాజా, కాచిగూడ రైల్వే స్టేషన్ లక్ష్యంగా దాడులు చేస్తామని హెచ్చరించారు. పోలీసులు అలర్ట్, తనిఖీలుటెర్రర్ బెదిరింపు మెయిల్ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ సిటీ స్పెషల్ బ్రాంచ్ 'టెర్రర్ థ్రెట్' పేరిట పోలీసులకు అలర్ట్ మెసేజ్ పంపింది. ఈ మేరకు కాచిగూడ రైల్వేస్టేషన్, టూరిస్ట్ ప్లాజా హోటల్ సహా అన్ని రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్లు సహా అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.
నిరంతరం అప్రమత్తంగా ఉండాలని నగర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు ఇంటెలిజెన్స్ సహా కీలక విభాగాలకు ఆదేశాలు జారీ చేశారు. హోటళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రార్థనా మందిరాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.
వదంతులు నమ్మొద్దు: -సీపీ మహేశ్ భగవత్
ఉగ్రదాడుల పేరిట వచ్చిన బెదిరింపు మెయిల్ పట్ల అప్రమత్తంగా ఉన్నామని హైదరాబాద్ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది. దీని వెనుక ఉన్న వాళ్లపై ఆరాతీస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మవద్దని, వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేయవద్దని సూచించారు. అనుమానాస్పద వస్తువులు లేదా వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కీలక ప్రాంతాల్లో యాంటీ సాబోటేజ్ తనిఖీలు చేపట్టారు.
